Rajinikanth: కేరళ వరద బాధితులకు రజనీకాంత్ సాయం.. రూ.15 లక్షల విరాళం!
- కేరళలో ఇంకా తగ్గని వరద ఉద్ధృతి
- సాయం కోసం బాధితుల ఎదురుచూపులు
- సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
ప్రకృతి విలయంతో అల్లాడుతున్న కేరళకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.15 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు శంకర్ రూ.10 లక్షలు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రూ.2 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు ఇప్పటికే పలు చిత్రపరిశ్రమలకు చెందిన నటులు ముందుకొచ్చారు. తమకు చేతనైనంత సాయం ప్రకటించారు. కేరళ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చారు.
వరదల కారణంగా కేరళలో 300 మందికిపైగా మరణించగా, 3.14 లక్షల మంది నిరాశ్రయులయ్యారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ముందుకొచ్చి కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించాలని కోరారు. తాను కూడా తనకు తోచినంత సాయం చేస్తున్నానని పేర్కొన్నారు.
కేరళ ఐఏఎస్ అధికారులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. హ్యుందయ్ ఇండియా సీనియర్ వైస్-ప్రెసిడెంట్ స్టీఫెన్ సుధాకర్, ఆ సంస్థ సౌత్ జోన్ బిజినెస్ హెడ్ వైఎస్ చాంగ్ సీనియర్ కలిసి కేరళ సీఎం పినరయి విజయన్‌కు కోటి రూపాయల చెక్ అందించారు.