Imran Khan: పాక్ ఆర్మీ చీఫ్‌ను ఎందుకు ఆలింగనం చేసుకున్నానంటే.. వివరణ ఇచ్చిన సిద్ధూ
- ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన సిద్ధూ
- పాక్ ఆర్మీ చీఫ్‌కు ఆలింగనం
- పీవోకే అధ్యక్షుడితో మాటామంతీ
ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వాను సిద్ధూ ఆలింగనం చేసుకున్నారు. అదే కార్యక్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అధ్యక్షుడు మసూద్ ఖాన్ పక్కన ఆయన కూర్చున్నారు. ఆయనతో మాటలు కలిపారు. దీంతో సిద్ధూ తీరు వివాదాస్పదమైంది. బీజేపీ సహా పార్టీలన్నీ ముక్త కంఠంతో సిద్ధూ తీరును తప్పుబట్టాయి. దేశ ఔన్నత్యాన్ని మంట గలిపిన సిద్ధూ దేశానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.
తనపై ముప్పేట దాడి జరుగుతుండడంతో సిద్ధూ స్పందించారు. గురునానక్ 550 జన్మదినం సందర్భంగా పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు మార్గాన్ని తెరవాలనుకుంటున్నట్టు ఆర్మీ చీఫ్ తనతో చెప్పారని సిద్ధూ పేర్కొన్నారు. ఆయన ఆ మాట చెప్పగానే ఆనందంతో కౌగిలించుకున్నట్టు సిద్ధూ వివరణ ఇచ్చారు.