Srisailam: శ్రీశైలానికి మరింత వరద... మరో రెండు గేట్లు ఎత్తిన అధికారులు!
- ఎగువ నుంచి మరింత వరద
- 881.9 అడుగులకు శ్రీశైలం జలాశయం నీటిమట్టం
- వచ్చిన నీరు వచ్చినట్టు సాగర్ కు విడుదల
ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాల నుంచి వస్తున్న వరద మరింతగా పెరగడంతో, శ్రీశైలం ప్రాజెక్టు మరో రెండు గేట్లను అధికారులు ఎత్తారు. నిన్న ప్రాజెక్టు ఆరు గేట్లను తెరచిన సంగతి తెలిసిందే. జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.9 అడుగుల మేరకు నీరుంది. ఇదే నీటిమట్టాన్ని కొనసాగిస్తూ, నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తామని, ఎగువ నుంచి వస్తున్న నీటిని వచ్చినట్టు దిగువకు పంపుతామని అధికారులు వెల్లడించారు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతోందని తెలిపారు.
కాగా, శ్రీరాంసాగర్ ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీ వరద వస్తోంది. 1091 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 1071 అడుగుల నీరుంది. 90 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న రిజర్వాయర్ లో ప్రస్తుతం 31.5 టీఎంసీల నీరుందని అధికారులు తెలిపారు. ఎల్లంపల్లి విషయానికి వస్తే 148 మీటర్ల గరిష్ఠ నీటిమట్టానికి అవకాశమున్న జలాశయంలో ప్రస్తుతం 147.58 మీటర్ల వరకూ నీరు చేరగా, గేట్లన్నీ ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు.