hanan: కేరళలో చేపలమ్మే అమ్మాయికి బంపరాఫర్.. ఓ గాయని బయోపిక్ లో నటించే ఛాన్స్!
- కేరళ విద్యార్థిని హనన్ ను వరించిన అదృష్టం
- వైకోమ్ విజయలక్ష్మీ బయోపిక్ లో ఛాన్స్
- వరద భాధితులకు రూ.1.5 లక్షలు ఇచ్చిన హనన్
మనం ఎవరికైనా సాయం చేస్తే అవసరమైనప్పుడు మనకూ సాయం అందుతుందన్నది పెద్దలు చెప్పేమాట. ఈ ఘటన తాజాగా రుజువైంది. ఇటీవల కేరళలో చదువుకోవడంతో పాటు కుటుంబాన్ని పోషించుకోవడానికి కొచ్చి సమీపంలో చేపలు అమ్ముకుంటున్న హనన్ హమీద్ గుర్తుందా? ఆమె కష్టాలను చూసి చలించిన పలువురు ప్రజలు తమకు తోచినంత సాయం చేశారు. తాజాగా ఆ యువతి తనకు అందిన రూ.1.50 లక్షలను కేరళ వరదల బాధితుల కోసం అందజేసి తన మంచి మనసును చాటుకుంది.
తాను కష్టాల్లో ఉన్నప్పటికీ.. తోటి ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన హనన్ ను ఇప్పుడు అదృష్టం వరించింది. ప్రస్తుతం ప్రముఖ గాయని వైకోమ్ విజయ లక్ష్మీ బయోపిక్ ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంట్లో విజయలక్ష్మీ పాత్రలో హనన్ ను ఎంపికచేశారు. అంధురాలు అయినప్పటికీ వైకల్యాన్ని జయించిన విజయలక్ష్మీ మలయాళం, తమిళంలో పలు విజయవంతమైన పాటలు పాడారు. గాయత్రీ వీణ అనే సంగీత పరికరం వాడటంలో ప్రావీణ్యం సాధించిన విజయలక్ష్మీ.. 2014లో ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. 2017లో వచ్చిన అల్లరి నరేశ్ సినిమా ‘మేడ మీద అబ్బాయ్’ లో ఓ పాటను కూడా ఆమె పాడారు. కేరళలోని వైకోమ్ లో 1981, అక్టోబర్ 7న పుట్టిన ఆమె.. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు.
హనన్ కు ఇంతకుముందే అవరై తేడి సెండ్రన్, అరై కల్లన్ ముక్కాల్ కల్లన్, మిఠాయ్ తెరివు సినిమాల్లో పాత్రలు దక్కాయి.