mexican couple: రోడ్డుపైనే భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు.. కారును నడుపుకుంటూ ఆసుపత్రికి వెళ్లి పిల్లాడికి జన్మనిచ్చిన భార్య!
- కాలిఫోర్నియాలోని శాన్ బెర్నాండీనోలో ఘటన
- నేరం చేయకపోయినా అరెస్ట్ చేసిన అధికారులు
- బెయిల్ కోసం రేపు కోర్టులో పిటిషన్ దాఖలు
వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు చాలామంది సామాన్యులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. అమెరికాకు వచ్చి పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న ఓ మెక్సికన్ జంటపై అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. గర్భిణిగా ఉన్న భార్యను ప్రసవం కోసం తీసుకెళ్లకుండా భర్త చేతులకు సంకెళ్లు వేసి పోలీస్ వాహనంలో జైలుకు తరలించారు. దీంతో అతని భార్య అతికష్టం మీద కారు నడుపుకుంటూ ఒంటరిగా ఆసుపత్రికి వెళ్లి సిజేరియన్ చేయించుకుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జోయెల్ అర్రొన్న(35), మారియా వెనెగస్(32) దంపతులు 12 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చారు. వీరికి నలుగురు పిల్లలు ఉండగా.. అమెరికాలో పుట్టడంతో వీరిందరికీ అక్కడి పౌరసత్వమే లభించింది. శాన్ బెర్నాండీనో నగరంలో ప్రస్తుతం వీరు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం డాక్టర్లు డెలివరీ తేదీ ఇవ్వడంతో మారియా దంపతులు ఆసుపత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో కారులో పెట్రోల్ కొట్టిస్తుండగా.. వెంటనే అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు అక్కడికి చేరుకున్నారు.
అనంతరం అధికారిక పత్రాలు, డాక్యుమెంట్లను చూపించాల్సిందిగా వీరిద్దరిని కోరారు. మారియా తన డాక్యుమెంట్లను చూపగా, జోయెల్ తొందరలో వాటిని ఇంట్లోనే మరిచిపోయాడు. దీంతో ఆమెను రోడ్డుపైనే వదిలేసిన అధికారులు.. జోయెల్ చేతికి బేడీలు వేసి తమ వాహనంలో తీసుకెళ్లిపోయారు. ఓ వైపు భర్త అరెస్ట్.. మరోవైపు ఒంటరిగా కారుతో ఉండిపోయిన మారియా చివరికి ధైర్యం తెచ్చుకుంది. అతికష్టం మీద కారును నడుపుకుంటూ ఆసుపత్రికి వెళ్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం మీడియాతో మట్లాడుతూ.. తమ కుటుంబంలో సంపాదించేది జోయెల్ మాత్రమేనని, అతడిని అరెస్ట్ చేస్తే తామెలా బతలకాలని మారియా రోదించింది.
జోయెల్ ఎలాంటి తప్పు చేయలేదని, పోలీస్ అధికారులు కూడా ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా జోయెల్ ను అరెస్ట్ చేశారని శాన్ బెర్నాండీనో కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ గ్రేసియా వ్యాఖ్యానించారు. రేపు కోర్టులో జోయెల్ విడుదలకు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు.