Uppal: త్వరలో భాగ్యనగరంలో ఎక్స్‌ప్రెస్ హైవే:- ఉప్పల్ టు ఇమ్లీబన్
- 150 అడుగుల వెడల్పుతో ఉప్పల్ నుంచి ఇమ్లిబన్ వరకు ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు నిర్మాణం
- మొదటిదశలో అలీకేఫ్ నుంచి ఉప్పల్ వరకు..రెండోదశలో అలీకేఫ్ నుంచి ఇమ్లిబన్ వరకు..
- ప్రత్యామ్నాయంగా ఎక్స్‌ప్రెస్ హైవే
అంబర్‌పేట, ఉప్పల్‌లో నిర్మాణం కానున్న భారీ ఫ్లెఓవర్ల నేపథ్యంలో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ నిర్వహణపై హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రస్తుతం ద్రిష్టి పెట్టారు. ఈ క్రమంలో ఉప్పల్ నుంచి ఇమ్లిబన్ వరకు ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు. సుమారు 14 కిలోమీటర్ల పొడవున 150 అడుగుల వెడల్పుతో మూసీకి సమాంతరంగా ఈ ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డును నిర్మించనున్నారు.
రెండు దశల్లో నిర్మించనున్న ఈ రోడ్డు మొదటి దశ అంబర్‌పేట అలీకేఫ్ నుంచి ఉప్పల్‌లోని ఏషియన్ మాల్ వరకు, రెండో దశ అలీకేఫ్ నుంచి ఇమ్లిబన్ బస్టాండ్ వరకు నిర్మించాలని, దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. రూ. 467.55 కోట్ల వ్యయంతో అంబర్‌పేట ఫ్లెఓవర్ నిర్మాణం పనులు త్వరలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.
అంబర్‌పేట ఫ్లెఓవర్ నిర్మాణానికి సంబంధించి రోడ్డు విస్తరణకుగాను పలు ఆస్తుల సేకరణ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందని, అలాగే, ఉప్పల్ ఫ్లెఓవర్ నిర్మాణానికి సంబంధించి కూడా రోడ్డు విస్తరణకు స్థానికులు అంగీకరించినట్లు మేయర్ తెలిపారు. ఈ నేపధ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు త్వరలోనే ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు నిర్మాణానికి ఏ విధమైన అడ్డంకులు లేవని చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణంపై గతంలోనే క్షేత్రస్థాయి పర్యటన జరిపి పరిస్థితులను అంచనా వేశామన్నారు. అంబర్‌పేట అలీకేఫ్ నుంచి ఉప్పల్‌లోని ఏషియన్ మాల్ వరకు మొదటి దశ పనులు త్వరలో చేపడతామని చెప్పిన ఆయన, అనంతరం రెండో దశలో అలీకేఫ్ సమీపంలోని మూసీని ఆనుకొని నేరుగా ఇమ్లిబన్ వరకు దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించామన్నారు.
జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, లేక్స్, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తదితర విభాగాల అధికారులతో కలిసి ఆయన ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. అంబర్‌పేట్ అలీకేఫ్ నుంచి మెట్రో డిపో మీదుగా బోడుప్పల్‌లోని ఏషియన్ మాల్ వరకు 150 అడుగుల వెడల్పుతో, అలాగే, అంబర్‌పేట అలీకేఫ్ నుంచి మూసీ మీదుగా ఇమ్లిబన్ బస్టాండ్ వరకు 150 అడుగుల వెడల్పుతో రోడ్డును నిర్మించనున్న ఈ ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డుతో దిల్‌సుఖ్‌నగర్, మూసారాంబాగ్, టీవీ టవర్, ఇమ్లిబన్, కోఠిలకు, ఉప్పల్ మెట్రో డిపో, బోడుప్పల్, ఉప్పల్ భగాయత్ ల నుండి ప్రయాణం సులభంగా సాగుతుందని మేయర్ రామ్మోహన్ చెప్పారు.