Goa: కేరళ తరహాలో గోవాకు కూడా ముప్పు ఉందన్న పర్యావరణవేత్త!
- కేరళ విపత్తుపై ముందే హెచ్చరించిన గాడ్గిల్
- దురాశ తో గోవాలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారు
- పర్యావరణ పరిరక్షణ చెయ్యకుంటే గోవాకు ముప్పు తప్పదు
కేరళలో విపత్తు సంభవించే అవకాశం ఉందని గతంలో హెచ్చరించిన ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ ఇప్పుడు గోవాలో కూడా అలాంటి ప్రమాదం పొంచి వుందని చెబుతున్నారు. గోవాలో పర్యావరణ పరిరక్షణకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని గాడ్గిల్ సూచించారు. లేకుంటే కేరళలో మాదిరిగానే గోవాలో కూడా జల ప్రళయం సంభవించే అవకాశం ఉందని తెలిపారు.
పర్యావరణ చట్టాలను అమలు చేయడం పట్ల ప్రభుత్వాలు ఉదాసీనత ప్రదర్శిస్తున్నాయన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ)ను సక్రమంగా పని చేయించడానికి కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్న గాడ్గిల్.. పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధ లేకనే ప్రకృతి విలయం సంభవిస్తుందని తెలిపారు. వెస్టర్న్ ఘాట్స్‌పై అధ్యయన కమిటీకి నాయకత్వం వహించిన ఆయన కేరళలో వరదలు సృష్టించిన విలయంపై మాట్లాడుతూ వెస్టర్న్ ఘాట్స్‌లో పర్యావరణ సంబంధిత సమస్యలు రావడం ప్రారంభమైందన్నారు.
చాలా రాష్ట్రాల్లో మాదిరిగానే గోవాలో కూడా అపరిమిత లాభాల కోసం, దురాశతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ గనుల తవ్వకం ద్వారా రూ.35 వేల కోట్లు అక్రమ లాభాలు పొందుతున్నట్లు జస్టిస్ ఎం బీ షా కమిషన్ అంచనా వేసిందన్నారు. అయితే వెస్టర్న్ ఘాట్స్‌లో గోవా లేదని, అయినప్పటికీ గోవా కూడా ఇటువంటి అన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు గాడ్గిల్.