Kerala: కేరళలో ఆకాశాన్నంటుతున్న ధరలు.. కిలో పచ్చిమిర్చి రూ.400
- ఆకాశంలో నిత్యావసర సరుకుల ధరలు
- ఆలు, ఉల్లి, క్యాబేజీ కిలో రూ.90
- రంగంలోకి పోలీసులు
వరదల తాకిడికి పంటలన్నీ కొట్టుకుపోవడంతో కేరళలో ఇప్పుడు నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తెరుచుకున్న ఒకటి రెండు షాపుల్లో ధరలు విచ్చలవిడిగా పెంచి అమ్ముతున్నారు. పచ్చిమిరపకాయలను అయితే కిలో రూ.400కు విక్రయిస్తున్నారు. దుకాణదారుల దోపిడీపై కొందరు వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ధరలను కొంత మేరకు తగ్గించారు. అయినప్పటికీ కిలో పచ్చిమిర్చి ధర రూ.120కి తగ్గలేదు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యాబేజీ వంటి వాటినైతే కిలో రూ.90కి విక్రయిస్తున్నారు.
ధరలు కొనుగోలు చేసే స్థాయిలో లేకపోవడంతో దుకాణదారులతో స్థానికులు వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే, వ్యాపారుల వాదన మరోలా ఉంది. తాము ఎంతో వ్యయప్రయాసలకోర్చి సరుకులు తెస్తున్నామని, తమకు కూడా ఇంచుమించు అంతే ధర పడుతోందని చెబుతున్నారు. సరకు రవాణాకే పెద్దమొత్తంలో చెల్లించాల్సి వస్తోందని, మరో మార్గం లేకే ధరలు పెంచాల్సి వస్తోందని అంటున్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో రంగంలోకి దిగిన పోలీసులు ధరలు పెంచి విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.