Adilabad District: కట్నం వేధింపులకు బలైన మహిళా కానిస్టేబుల్.. నిర్మల్ జిల్లాలో ఘటన
- నిర్మల్ జిల్లా కడెంలో ఘటన
- పెళ్లయిన మూడు నెలలకే తనువు చాలించిన కానిస్టేబుల్
- అల్లుడి వేధింపులు తాళలేకేనన్న కుటుంబ సభ్యులు
కట్నం వేధింపులకు మహిళా కానిస్టేబుల్ బలైంది. భర్త వేధింపులు తాళలేక పెళ్లయిన మూడు నెలలకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్ జిల్లా కడెంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కలమడుగుకు చెందిన మదన్-లక్ష్మి దంపతుల కుమార్తె మధురేఖకు నిర్మల్ జిల్లా పెంబి మండలానికి చెందిన గుగ్లావత్ శ్రీనివాస్‌తో మూడు నెలల క్రితం వివాహమైంది.
మధురేఖ తొలుత లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేయగా, నెలన్నర క్రితం ట్రాన్స్‌ఫర్‌పై కడెం వచ్చింది. ఆదివారం ఉదయం మధురేఖ డ్యూటీకి రాకపోవడంతో విషయం తెలుసుకునేందుకు హోంగార్డు శాంత ఆమె క్వార్టర్స్‌కు వెళ్లింది. అక్కడ మధురేఖ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసి వెంటనే ఎస్సైకి సమాచారం అందించి ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పెళ్లయిన దగ్గరి నుంచి తమ కుమార్తెను అల్లుడు కట్నం కోసం వేధిస్తున్నాడని, అతడు పెట్టే బాధలు భరించలేకే మధురేఖ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.