Kerala: వరద బాధితుల కోసం వెన్నును మెట్టుగా మార్చిన మత్స్యకారుడు.. రియల్ హీరో అంటూ కొనియాడుతున్న నెటిజన్లు!
- వరద సహాయక చర్యల్లో వందలాది మంది మత్స్యకారులు
- వైరల్ అవుతున్న జైశాల్ వీడియో
- శభాష్ అంటూ కొనియాడుతున్న నెటిజన్లు
కేరళ వరద బాధితులకు అందిస్తున్న సాయంలో ఓ మత్స్యకారుడు హీరోగా మారాడు. వరద సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ సిబ్బందితో కలిసి మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కేరళ వ్యాప్తంగా దాదాపు 600 మంది మత్స్యకారులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంగరలో అందిస్తున్న సహాయక చర్యల్లో పాల్గొన్న జైశాల్ కేపీ అనే మత్స్యకారుడుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వెంగరలో వరదల్లో చిక్కుకున్న వారిని పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే, నీటిలో ఉన్న బోటులోకి ఎక్కేందుకు మహిళలు, చిన్నారులు ఇబ్బంది పడుతుండడాన్ని గ్రహించిన జైశాల్ బాధితుల కోసం తన వీపును మెట్టుగా మార్చాడు. నీటిలో మోకాలు, మోచేతులపై కూర్చున్నాడు. అతడి వెన్నుపై కాలువేస్తూ మహిళలు బోటులోకి చేరుకున్నారు. ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. పదిమందికిపైగా అతడి పై నుంచి ఎక్కి బోటులోకి చేరుకున్నారు. వారు బోటులోకి చేరుకున్నంత వరకు జైశాల్ నీటిలో అలాగే మోచేతులు, కాళ్లపై బలం ఆనించాడు. జైశాల్ సాయాన్ని చూసిన వారు శభాష్ అంటూ కొనియాడుతున్నారు. నిజమైన హీరో అంటూ కామెంట్ చేస్తున్నారు.