Marriage: రూ. 3 వేల కోసం... వాదులాడుకుని వెళ్లిపోయిన వధువు, వరుడు!
- చిత్తూరు జిల్లాలో ఘటన
- వరుడికి ఉంగరం ఇచ్చేందుకు అంగీకారం
- ఆపై పాత అప్పు తీర్చాలని పట్టుబట్టిన వధువు బంధువులు
ఆర్థిక సంబంధాలే తప్ప, మానవ సంబంధాలకు విలువ లేదని మరోసారి నిరూపించిన ఘటన ఇది. రూ. 3 వేల కోసం మొదలైన వివాదం, ఒకటి కావాల్సిన జంటను విడదీసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన యువతికి, పలమనేరుకు చెందిన యువకుడికి ఆదివారం నాడు పెద్దలు వివాహాన్ని నిశ్చయించారు. ఉదయం పెళ్లి ముహూర్తం సమయంలో వరుడి చేతి వేలికి ఉంగరాన్ని తొడగాలని అంతకుముందే అనుకున్నారు.
అయితే, గతంలో తమ వద్ద తీసుకున్న రూ. 3 వేల అప్పు ఇస్తేనే ఉంగరం ఇస్తామని పెళ్లి కుమార్తె బంధువులు తెగేసి చెప్పారు. దీంతో వివాదం ప్రారంభమై, అది వధూవరుల వరకూ వెళ్లింది. ఇంత తక్కువ మొత్తం కోసం గొడవకు దిగుతారా? అంటూ వరుడు వచ్చి వాగ్వాదానికి దిగాడు. వధువు కూడా తన వాళ్లను వెనకేసుకొస్తూ అతనితో వాదనకు దిగింది. దాంతో ఆ గొడవ ముదిరిపోయింది. పెళ్లి కొడుకు తీరు చూసి, అసలీ పెళ్లే తనకు వద్దని పెళ్లి కూతురు చెప్పేసింది. మధ్యవర్తులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా, ప్రయోజనం లేకపోగా, మగ, ఆడ పెళ్లివాళ్లు ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోవడంతో కల్యాణమండపం మూగబోయింది.