Geeta Govindam: తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దొద్దు: 'లీకు' వీరులకు చిరంజీవి హెచ్చరిక
- స్నేహితులకు ముందే చూపాలన్న కుర్రతనం వద్దు
- సినిమాలను ముందే బయటకు పంపితే కోట్ల నష్టం
- వందల మంది కడుపు కొట్టొద్దన్న చిరంజీవి
కొన్ని వందల మంది కోట్ల రూపాయలు వెచ్చించి తీసే సినిమాలను, తమ ఫ్రెండ్స్ కు ముందే చూపించాలన్న అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, బయటకు లీక్ చేయడాన్ని మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా తప్పుబట్టారు. అలా చేసిన వాళ్లు తల్లిపాలను తాగుతూ తల్లి రొమ్ములను గుద్దుతున్నట్టేనని, ఇటువంటి వారిని సహించేది లేదని హెచ్చరించారు. ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'గీత గోవిందం' సక్సెస్ మీట్ కు హాజరైన ఆయన, కుర్రతనం కొద్దీ సినిమాను తస్కరించడం అన్యాయమని, వందలమంది కడుపు కొడుతున్నట్టేనని అభిప్రాయపడ్డారు.
సినిమా బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారని చెప్పడానికి ఈ సినిమాయే ఉదాహరణని వ్యాఖ్యానించారు. తనకు 'ఖైదీ' ఎలాగో, విజయ్ దేవరకొండకు 'గీత గోవిందం' అలా నిలిచిపోతుందని చిరంజీవి కితాబిచ్చారు. తొలుత యువతను ఆకట్టుకున్న విజయ్, ఇప్పుడు కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడని అన్నారు. కళ్లతోనే కోపాన్ని ప్రదర్శించిన హీరోయిన్ రష్మికకు మంచి భవిష్యత్ ఉందని చెప్పారు.