Kerala: కేరళ కోసం సరుకుల ఉచిత రవాణాకు ముందుకొచ్చిన రైల్వే
- కేరళకు సరుకులు ఉచిత రవాణా
- ప్రకటించిన రైల్వే మంత్రి
- ఇప్పటికే తాగునీటితో బయలుదేరిన రైలు
జల విలయంతో అల్లాడుతున్న కేరళకు తనవంతు సాయం అందించేందుకు భారతీయ రైల్వే ముందుకొచ్చింది. కేరళకు పంపించే సహాయ సామగ్రిని ఉచితంగా రవాణా చేస్తామని ప్రకటించింది. కేరళ వరదలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని, వరదల్లో చిక్కుకున్న వారికి చేతనైనంత సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేరళకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు పంపిస్తున్న సరుకులను ఉచితంగా రవాణా చేస్తామని పేర్కొన్నారు.
ఇప్పటికే పూణె నుంచి 14 ట్యాంకర్లతో కూడిన రైళ్లు నీళ్లతో బయలుదేరాయని, గుజరాత్‌లోని రాట్నం నుంచి మరికొన్ని బయలుదేరుతాయని మంత్రి ట్వీట్ చేశారు. కేరళ ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ అధికారుల ప్రకారం.. ఆగస్టు 8 నుంచి ఇప్పటి వరకు 194 మంది ప్రాణాలు కోల్పోగా 36 మంది గల్లంతయ్యారు. 3.14 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.