Rishabh Pant: ఇంగ్లండ్‌తో టెస్టులో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న టీమిండియా కీపర్!
- దినేశ్ కార్తీక్ స్థానంలో జట్టులోకి పంత్
- ఐదు క్యాచ్‌లు అందుకున్న కీపర్‌గా రికార్డు
- టెస్టు క్రికెట్‌ను సిక్సర్‌తో ఆరంభించిన పంత్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (20) రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. టెస్టు మ్యాచ్ అరంగేట్రాన్ని సిక్సర్‌తో ప్రాంభించిన తొలి భారతీయ క్రికెటర్‌గా తొలి రోజు రికార్డు నెలకొల్పిన రిషబ్ మలిరోజు ఆటలో ఏకంగా ఐదు క్యాచ్‌లు అందుకున్నాడు. ఫలితంగా అరంగేట్ర మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు అందుకున్న తొలి ఇండియన్‌గా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. కీపర్ దినేశ్ కార్తీక్ గాయాల బారినపడడంతో అతడి స్థానాన్ని పంత్ భర్తీ చేశాడు.
తొలి రెండు టెస్టుల్లోనూ ఓటమి పాలైన భారత్.. మూడో టెస్టులో పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన భారత్.. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. చటేశ్వర్ పుజారా 33, కెప్టెన్ కోహ్లీ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.