Tamil Nadu: కాలేజీ ఆవరణలో ఫోన్ల వాడకంపై నిషేధం విధించిన తమిళనాడు.. విద్యార్థుల గగ్గోలు!
- అమ్మాయిల ఫొటోలు, వీడియోలు తీస్తున్నట్టు ఫిర్యాదులు
- ఐఐటీ వంటి సంస్థలకు మినహాయింపు
- ఆదేశాలు జారీ చేసిన డీసీఈ
కళాశాల ఆవరణలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడకాన్ని నిషేధిస్తూ తమిళనాడు డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ (డీసీఈ) సర్క్యులర్ జారీ చేసింది. ఇది ఒక్క ప్రభుత్వ కళాశాలలకు మాత్రమే కాదని, ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న కాలేజీలు, ప్రైవేటు సంస్థలకు కూడా వర్తిస్తుందని సర్క్యులర్లో పేర్కొంది.
కో-ఎడ్యుకేషన్ కళాశాలల ఆవరణలో అమ్మాయిల వీడియోలు, ఫొటోలను అబ్బాయిలు తీస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని, అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు డీసీఈకి చెందిన ఓ అధికారి తెలిపారు. అలాగే, పరీక్షల సమయంలో అక్రమాల కోసం ఫోన్లను ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే, ఈ నిషేధం ఐఐటీ వంటి సంస్థలకు వర్తించదని స్పష్టం చేశారు. అక్కడి విద్యార్థులకు మొబైల్ ఫోన్లను ఎలా ఉపయోగించాలో తెలుసన్నారు. అయితే, డీసీఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. ఫోన్లు ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగంగా మారిపోయాయని, వాటిని వాడొద్దని చెప్పడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.