SP BALU: మా ఊరిలో ఆంధ్రులు, తమిళులు అన్న తేడా ఉండదు!: ఎస్పీ బాలు

  • అందరం ఐకమత్యంగానే ఉంటాం
  • సొంతూరిని ఎప్పుడూ మరచిపోకూడదు
  • స్వగ్రామంలో నీటిశుద్ధి ప్లాంట్ ను ప్రారంభించిన బాలు

తమ ఊరిలో ఆంధ్రులు, తమిళులు అన్న తేడా లేకుండా అందరూ ఐకమత్యంగా ఉంటారని గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. జీవితంలో ఎక్కడ స్థిరపడ్డా సొంతూరి బాగోగుల గురించి మరచిపోకూడదని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని స్వగ్రామం కోనేటంపేటలో ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా రూ.12 లక్షలతో కోనేటంపేటలో తాగునీరు కోసం ఏర్పాటుచేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని బాలు ప్రారంభించారు. అలాగే స్కూలు విద్యార్థుల కోసం నిర్మించిన తాగునీటి ట్యాప్ లు, మరుగుదొడ్లను బాలు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోనేటంపేట తన అమ్మమ్మ గారి ఊరని తెలిపారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత గ్రామాన్ని మరచిపోకూడదని వ్యాఖ్యానించారు.

ఆత్మసంతృప్తి కోసమే తాను వాటర్ ప్లాంట్ కు రూ.12 లక్షలు ఇచ్చినట్లు బాలు తెలిపారు. ఇది కీర్తి కోసం చేస్తున్నది కాదని స్పష్టం చేశారు. అనంతరం గ్రామస్తులతో బాలు ముచ్చటించారు. సొంత ఊరి ప్రజల కోరిక మేరకు పాటలు కూడా పాడారు.


  • Loading...

More Telugu News