Chandrababu: పోటెత్తుతున్న గోదారి.. నెమ్మదించిన పోలవరం పనులపై చంద్రబాబు సమీక్ష
- నిర్మాణ సంస్థ, అధికారులతో చంద్రబాబు సమీక్ష
- వరద కారణంగా గేలరీ వాక్ నిర్మాణంలో జాప్యం
- గేట్ల ఏర్పాటు కూడా స్వల్పంగా వాయిదా పడే అవకాశం
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పోటెత్తుతోంది. దీంతో, ఆంధ్రులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పనులపై సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా పనులు నెమ్మదించాయని ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ నవయుగ ముఖ్యమంత్రికి తెలిపింది.
వరద కారణంగా గేలరీ వాక్ నిర్మాణంలో కొంత జాప్యం జరుగుతుందని అధికారులు తెలిపారు. దీంతోపాటు గేట్ల ఏర్పాటు కూడా స్వల్పంగా వాయిదా పడే అవకాశం ఉందని చెప్పారు. కేంద్ర బృందం పరిశీలనకు వచ్చే సెప్టెంబర్ నాటికి... కాఫర్ డ్యామ్, స్పిల్ వే పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. పునరావాస కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గిన వెంటనే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. డిసెంబర్ నాటికి పునరావాస కార్యక్రమం పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు.