Tamil Nadu: మహిళా ఎస్పీపై నెలలుగా ఐజీ లైంగిక వేధింపులు.. విచారణకు కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం!
- మహిళా ఎస్పీ ఆరోపణలపై విచారణకు కమిటీ ఏర్పాటు
- ఐజీ తనను ఎలా వేధించిందీ గ్రాఫిక్స్ రూపంలో ఫిర్యాదు
- అసభ్యకర మెసేజ్‌లు, వీడియోలు పంపేవారని ఆరోపణ
తమిళనాడు ఐజీపై మహిళా ఎస్పీ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. విచారణ కోసం మధ్యంతర కమిటీని ఏర్పాటు చేసింది. పలు సందర్భాల్లో ఐజీ తనను లైంగిక వేధింపులకు ఎలా గురిచేసిందీ గ్రాఫిక్స్ రూపంలో ఆమె వెల్లడించారు. చాలాసార్లు ఐజీ తనను కౌగిలించుకున్నాడని వివరించారు.
ప్రస్తుతం ఈ కేసును స్టేట్ పోలీసు ఆఫీస్‌కు చెందిన విశాఖ కమిటీకి పార్వార్డ్ చేశారు. ఈ కమిటీకి ఏడీజీపీలు సీమా అగర్వాల్, ఎస్‌యూ అరుణాచలం, డీఐజీ థెనమోళిలను నామినేట్ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) టీకే రాజేంద్రన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సరస్వతి, రమేష్‌లు కూడా ఈ దర్యాప్తులో భాగం కానున్నారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం కింద ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు.
ఐజీ తనను గత ఏడు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నట్టు బాధిత ఎస్పీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తెల్లవారు జామునే ఐజీ తనకు ఫోన్ చేసేవారని, అసభ్యకర మెసేజ్‌లు పంపేవారని పేర్కొన్నారు. అంతేకాక, తన సమక్షంలో అసభ్యకర వీడియోలను ప్రదర్శించే వారని ఆరోపించారు. వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్)లో ఉన్నవి లేనివి రాస్తానని తనను బెదిరించేవారని మహిళా ఎస్పీ ఆరోపించారు.