Andhra Pradesh: అమరావతి... మంత్రుల చాంబర్లలో వర్షపు నీరు... అసెంబ్లీలోకి కూడా!
- గత మూడు రోజులుగా భారీ వర్షాలు
- గోడల నుంచి లోపలికి లీక్ అవుతున్న నీరు
- గంటా శ్రీనివాసరావు, అమర్ నాథ్, కాలువ శ్రీనివాసులు కార్యాలయాల్లో నీరు
గడచిన రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి తడిసి ముద్దవుతుండగా, అసెంబ్లీతో పాటు సెక్రటేరియేట్ లోని మంత్రుల చాంబర్లలోకి నీరు ప్రవేశించింది. నిన్న కురిసిన వర్షంతో భవనపు గోడలు లీక్ అవుతుండగా, గోడల నుంచి నీరు ప్రవేశించింది. మంత్రి గంటా శ్రీనివాసరావు చాంబర్ ను ఆనుకునే ఉండే వ్యక్తిగత గదిలో సీలింగ్ కున్న ధర్మాకోల్ షీట్లు ఊడిపడ్డాయి.
మరో మంత్రి అమర్ నాథ్ కార్యాలయంలో పరిస్థితి కూడా ఇంతే. కంప్యూటర్ ఆపరేటర్లు కూర్చునే గదిలోని సీలింగ్ నుంచి కూడా నీరు బయటకు వచ్చింది. కాలువ శ్రీనివాసులు చాంబర్ లోనూ లీకేజీ కనిపించింది. ఇక అసెంబ్లీ భవనంలో చాలా చోట్ల నీరు లీక్ అవుతోందని సిబ్బంది గుర్తించారు. ఇదే భవనం తొలి అంతస్తులోని రిపోర్టింగ్ రూమ్, లైబ్రరీ ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేసింది. నీరు లీక్ అవుతున్న చోట అవసరమైన చర్యలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా అమరావతిలోని పలువురు మంత్రులు, విపక్ష నేత వైఎస్ జగన్ కార్యాలయాల్లోకి నీరు వచ్చిన సంగతి తెలిసిందే.