Rafale: రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన అనిల్ అంబానీ!

  • రాహుల్ ఆరోపణలు పూర్తి అసంబద్ధం
  • స్వార్థ ప్రయోజనాలు ఆశించే ఆరోపణలు
  • రిలయన్స్ చైర్మన్ అనిల్ అంబానీ

రాఫెల్ యుద్ధ విమానాల డీల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కొట్టి పడేశారు. రాహుల్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు. అవగాహన లేమితోనే ఆయనా వ్యాఖ్యలు చేశారని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాఫెల్ డీల్‌ను ఎంతో అనుభవం ఉన్న హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) వంటి సంస్థలను కాదని, ఏమాత్రం అనుభవం లేని రిలయన్స్‌కు అప్పగించడాన్ని రాహుల్ ప్రశ్నించారు.
 
రాహుల్ ఆరోపణలపై అనిల్ అంబానీ లేఖ రాస్తూ.. కాంగ్రెస్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, స్వార్థ ప్రయోజనాలను ఆశించే వాటిని చేశారని పేర్కొన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రిలయన్స్ గ్రూప్ కంపెనీ ఎటువంటి కాంట్రాక్ట్‌లు తీసుకోలేదని అనిల్ వివరించారు.

డిసెంబరు 2014లో రిలయన్స్ గ్రూప్ రక్షణ పరికరాల తయారీ రంగంలోకి ప్రవేశించింది. జనవరి 2015లో రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనకు నెల రోజుల ముందే రిలయన్స్ రక్షణ రంగంలోకి ప్రవేశించడం.. ఆ వెంటనే ఆ డీల్‌ను రిలయన్స్ దక్కించుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

  • Loading...

More Telugu News