vinesh phogat: స్వర్ణ విజేత వినేష్ ఫొగాట్ కు భారీ నజరానా ప్రకటించిన హర్యాణా ప్రభుత్వం
- 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వినేష్ ఫొగాట్
- రూ. 3 కోట్ల నజరానా ప్రకటించిన హర్యాణా ప్రభుత్వం
- సివిల్ సర్వీసెస్ లేదా పోలీస్ సర్వీస్ లో ఉద్యోగం ఇస్తామంటూ హామీ
ఇండొనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత్ కు స్వర్ణ పతకాన్ని అందించింది రెజ్లర్ వినేష్ ఫొగాట్. ఈ నేపథ్యంలో, ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. హర్యాణాకు చెందిన ఆమెకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. ఈ విషయాన్ని హర్యాణా క్రీడల శాఖ మంత్రి అనిల్ విజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీనికి తోడు సివిల్ సర్వీసెస్ లేదా పోలీస్ సర్వీస్ లో ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. 50 కేజీల విభాగంలో వినేష్ ఫొగాట్ స్వర్ణ పతకాన్ని సాధించింది.
షూటింగ్ లో రజత పతకం సాధించిన లక్షయ్ షెరాన్ కు కూడా రూ. 1.5 కోట్ల నజరానా ఇస్తున్నట్టు అనిల్ విజ్ తెలిపారు. రెజ్లర్ భజరంగ్ పూనియాకు కూడా హర్యాణా ప్రభుత్వం రూ. 3 కోట్ల నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.