byke: అద్భుతం.. బైక్ మీద నుంచి పడిపోయిన తల్లిదండ్రులు.. 300 మీటర్లు బైక్ పైనే పోయిన చిన్నారి.. వీడియో చూడండి!
- తమ ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టిన తండ్రి
- తల్లిదండ్రులు కింద పడిపోయినా బైక్ తో పాటే వెళ్లిన చిన్నారి
- డివైడర్ మీదున్న గడ్డిలో పడి, సురక్షితంగా బయటపడ్డ చిన్నారి
ఇది నిజంగా మహాద్భుతం. చూస్తే కానీ నమ్మలేం. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ఓ చిన్నారి సురక్షితంగా బయటపడిన వైనం. వివరాల్లోకి వెళ్తే, చన్నపరమేశ్వర్, రేణుక దంపతులు తమ ఐదేళ్ల చిన్నారితో కలసి బేగూరు నుంచి బెంగుళూరుకు బైక్ పై వెళ్తున్నారు. వారికి ముందుగా వెళ్తున్న బైక్ ను చిన్నారి తండ్రి వేగంగా ఢీకొట్టాడు.
ఈ ఘటనలో దంపతులిద్దరూ బైక్ పై నుంచి కిందకు పడిపోయారు. కానీ, వారి బైక్ మాత్రం కిందపడలేదు. ముందు కూర్చున్న చిన్నారితో పాటు దాదాపు 300 మీటర్ల దూరం ప్రయాణించింది. ఆ తర్వాత వేగం తగ్గిన బైక్, రోడ్డుకు పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొంది. దీంతో, ఆ చిన్నారి పక్కన ఉన్న గడ్డిలో పడి, సుక్షితంగా బయట పడింది.
ఈ మొత్తం ఘటన వెనుకనే వస్తున్న ఓ కారు కెమెరాలో రికార్డ్ అయింది. ఆదివారం సాయంత్రం బెంగుళూరు రూరల్ లోని నేలమంగళ ప్రాతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దంపతులిద్దరికీ ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియోను ఓ పోలీసు ట్విట్టర్ లో షేర్ చేశారు.