India: అటల్ నగర్‌గా మారనున్న చత్తీస్‌గఢ్ రాజధాని.. వాజ్‌పేయి రుణాన్ని తీర్చుకుంటున్న ప్రభుత్వం!
- అటల్ జీ స్మరణలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు
- పేర్ల మార్పుకు సిద్ధమైన పలు రాష్ట్రాలు
- చత్తీస్గడ్ ఇక అటల్ మయం
దివంగత మాజీ ప్రధాని, భారతరత్న వాజ్‌పేయి స్మారకార్థం తమ నూతన రాజధాని నయా రాయ్‌పూర్ పేరును అటల్ నగర్‌గా మార్చాలని చత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. చత్తీస్‌గఢ్ ఏర్పాటులో వాజ్‌పేయి చేసిన మేలును తామెప్పటికీ మర్చిపోలేమని, అందుకే రాజధాని పేరును అటల్ నగర్‌గా మార్చి స్మరించుకోవాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తెలిపారు. అలాగే, బిలాస్పూర్ యూనివర్సిటీ, నయారాయ్‌పూర్‌లోని జాతీయ పార్కు, రాజ్‌నందగావ్ వైద్యశాలకు కూడా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు రాష్ట్రంలోని పోలీసు బెటాలియన్ పేరును ఫోఖ్రాన్ బెటాలియన్‌గా మార్చనున్నట్టు తెలిపారు.
వాజ్‌పేయి స్మరణలో మరికొన్ని రాష్ట్రాలు కూడా ముందుకొస్తున్నాయి. స్మారకాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిషికేష్‌లోని ఆడిటోరియానికి వాజ్‌పేయి పేరు పెట్టాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే, మహారాష్ట్రలోని స్టడీ సర్కిళ్లు కూడా అటల్ పేరుపై మారిపోనున్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.