Snake: పాము కరిచిందని ఆసుపత్రికి వెళితే... బతికుండగానే శవపరీక్షకు పంపారు... హన్మకొండ వైద్యుల నిర్వాకం!
- 19వ తేదీన కరిచిన పాము
- బాలిక చనిపోయిందన్న ప్రైవేటు వైద్యులు
- బతికుందని గుర్తించి చికిత్స చేసిన ఎంజీఎం డాక్టర్లు
- నిన్న సాయంత్రం మరణించిన బాలిక
తమ బిడ్డను పాము కరిచిందని, ఎలాగైనా కాపాడాలని వేడుకుంటూ ఆసుపత్రికి వెళితే, బతికుండగానే చనిపోయిందని చెప్పి, శవపరీక్షకు పంపిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని హవల్దార్ పల్లికి చెందిన గూళ్ల సదానందం కుమార్తె రిషిత (13). 19వ తేదీ రాత్రి ఆమె నిద్రిస్తుండగా, ఓ పాము కరిచింది.
వెంటనే ముల్కనూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి రిషితను తీసుకెళ్లి, ఆపై మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో, హన్మకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు బాలిక మరణించిందని చెప్పడంతో విలవిల్లాడిపోయారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించడంతో, పోస్టుమార్టం వేళ, పాప ఇంకా బతికే ఉందని గుర్తించిన వైద్యులు, అత్యవసర చికిత్స చేసినప్పటికీ, ఫలించలేదు. అప్పటికే విషం శరీరమంతా వ్యాపించగా, నిన్న సాయంత్రం బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మల్కనూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.