PV Sindhu: ఫోర్బ్స్‌ జాబితాలో పీవీ సింధు.. ప్రపంచంలో సంపన్న క్రీడాకారిణిగా 7వ స్థానం

  • ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం పొందిన బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు 
  • గత జాబితాలో 13వ స్థానం రాగా తాజాగా 7వ స్థానంలో నిలిచిన సింధు 
  • టాప్ 10 జాబితాలో భారత్ నుండి ఒక్క బ్యాడ్మింటన్‌ స్టార్ మాత్రమే!  

ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్‌ జాబితాలోకి తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు కూడా చేరింది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తున్న క్రీడాకారిణుల జాబితాలో పీవీ సింధు టాప్10లో ఒకరిగా నిలిచింది. గత ఏడాది ప్రకటించిన జాబితాలో పీవీ సింధు 13వ స్థానంలో వుండగా, తాజాగా ప్రకటించిన జాబితాలో 7వ స్థానాన్ని దక్కించుకుంది. టోర్నీలు ఆడటం వల్ల పొందే ప్రైజ్ మనీతో పాటు వివిధ వాణిజ్య ఒప్పందాల ద్వారా వారు సంపాదించే మొత్తాన్ని బట్టి ఈ జాబితాలో క్రీడాకారిణుల ర్యాంకులను ఫోర్బ్స్‌ ప్రకటించింది.

 ఈ జాబితాలో అగ్రస్థానంలో సెరెనా విలియమ్స్ నిలిచింది. ఆమె అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవటం ఇది వరుసగా మూడోసారి.  టాప్ 10 లో స్థానం దక్కించుకున్న క్రీడాకారిణుల సంపాదన వివరాలు ఇలా వున్నాయి. టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ 18.1 మిలియన్ డాలర్లు సంపాదించి మొదటి స్థానంలో వుంటే, టెన్నిస్ క్రీడాకారిణులు కరోలిన్‌ వొజ్నొకి 13 మిలియన్ డాలర్లు, స్లోనే స్టీఫెన్స్‌ 11.2 మిలియన్ డాలర్ల సంపాదనతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.  

టెన్నిస్ విభాగం నుండే గార్బిన్‌ ముగురుజ 11 మిలియన్ డాలర్లు, మరియా షరపోవా 10.5 మిలియన్ డాలర్లు, వీనస్‌ విలియమ్స్‌ లు  10.2 మిలియన్ డాలర్ల సంపాదనతో నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో వున్నారు. ఇక భారత క్రీడాకారిణి బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు 8.5 మిలియన్ డాలర్ల సంపాదతో 7వ స్థానంలో నిలిచింది. భారత దేశం నుండి ఫోర్బ్స్‌ జాబితాలో టాప్10లో క్రీడాకారిణి పీవీ సింధు మాత్రమే ఉండడం విశేషం. అగ్ర స్థానంలో కొనసాగుతున్న సెరెనా గతేడాది తల్లి కావటం వల్ల ఆటలకు దూరమైనా ఆమె ప్రధమ స్థానంలో నిలిచింది. టాప్ 10 జాబితాలో 8 మంది టెన్నిస్ స్టార్ లు, ఒక రేస్ కార్ డ్రైవర్ వుండగా, మన తెలుగు తేజం పీవీ సింధు ఉంది. షట్లర్లలో ఒక్క సింధుకే ఈ స్థానం దక్కింది. 

  • Loading...

More Telugu News