Flood: వరద బాధితులను గుర్తించేందుకు డ్రోన్ల సాయం!
- నిరాశ్రయులను, జాడ తెలీని వారిని గుర్తించేందుకు డ్రోన్ల వినియోగం
- కర్నాటక రాష్ట్రం కొడగు జిల్లాలో రంగంలోకి 8 డ్రోన్లు
- ఆహారాన్ని, సహాయసామాగ్రిని జారవిడిచే విధంగా తయారీ
కొడగు జిల్లాలో వర్షాలు, వరదలకు నిరాశ్రయులైనవారు, జాడ కనిపించకుండా పోయిన వారి కోసం కర్ణాటక ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగిస్తోంది. అడ్వాన్స్ డ్ హై-డెఫినిషన్ ఏరియల్ మిషన్, ఐపాడ్‌లను రంగంలోకి దింపి వరదలో చిక్కుకున్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాను అతలాకుతలం చేసిన వరదలలో జాడ తెలియకుండా పోయినవారు, వివిధ ప్రాంతాల్లో సహాయం కోసం నిరీక్షిస్తున్న వారు, కొండ చరియలు విరిగిపడి చిక్కుకున్న వారిని గుర్తించేందుకు 8 డ్రోన్లను అధికారులు రంగంలోకి దింపారు.
జలదిగ్బంధంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సుశిక్షితులైన యువకుల బృందం కూడా రంగంలోకి దిగింది. తామున్న ప్రాంతాల సమాచారాన్ని, అక్కడ అవసరాలను సహాయక సిబ్బందికి చేరవేయడంలో శిక్షణ పొందిన వీరు ఫ్లయింగ్ డ్రోన్ల సాయంతో బాధితులను గుర్తించి సహాయం అందించేందుకు కృషి చేస్తున్నారు. 25 కిలోమీటర్ల మేర ప్రయాణించగలిగే ఈ డ్రోన్లను వరద బాధితులకు ఆహార పదార్ధాలను తీసుకెళ్లే విధంగానూ, తేలికపాటి మందులు, సహాయ సామగ్రిని పైనుంచి జారవిడిచే విధంగానూ రూపొందించారు. సిబ్బంది వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా వీటితో సహాయం అందించే వీలుంది.