vajpayee: 100 నదుల్లో వాజ్‌పేయి చితాభస్మ నిమజ్జనం.. కలశాలు అందజేసిన ప్రధాని!
- గంగానదితో సహా వందనదుల్లో వాజ్‌పేయి అస్థికల నిమజ్జనం
- ఆస్థి కలశాలను వివిధ రాష్ట్రాల అధ్యక్షులకు ఇచ్చిన మోదీ
- ఆస్థి కలశ యాత్ర నిర్వహించి నిమజ్జనం చెయ్యనున్న బీజేపీ శ్రేణులు
మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ఆస్థి కలశ యాత్ర చేపట్టి దేశంలోని 100 నదుల్లో ఆయన అస్థికలను నిమజ్జనం చేయాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు వాజ్‌పేయి అస్థి కలశాలను ఆయా నదుల్లో నిమజ్జనం చేసేందుకు ఈ రోజు అందజేశారు. ప్రతి రాష్ట్రంలోనూ ఆస్థి కలశ యాత్ర నిర్వహించి నిమజ్జనం చేయాలని సూచించారు. రాష్ట్ర రాజధానులలో ఈ యాత్రలు ప్రారంభమై అన్ని బ్లాకులకు చేరుకుంటాయి. ఆస్థి కలశాలను అందజేసే ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.
గంగా నది సహా.. మొత్తం 11 రాష్ట్రాల్లోని వంద నదుల్లో వాజ్ పేయి చితాభస్మం కలుపుతారు. మధ్యప్రదేశ్ లోని నర్మద, చంబల్, పార్వతి, క్షిప్రా, తపతి, రెవా, బెట్వా, పెంచ్, సింధ్, కేన్ నదుల్లో కలిపేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు. తెలంగాణలోని కృష్ణా , తుంగభద్ర, గోదావరి, మూసీ నదుల్లో నాలుగుచోట్ల వాజ్‌పేయి చితాభస్మాన్ని కలపనున్నారు.