Revanth Reddy: ప్రగతి నివేదన సభ నిర్వహించడం మీవల్ల కాదు: రేవంత్ రెడ్డి ఎద్దేవా
- రాహుల్ గాంధీ పర్యటన సక్సెస్ తో దిక్కుతోచని స్థితిలో టీఆర్ఎస్
- ప్రగతి నివేదన సభ ఉద్దేశం ప్రజల దృష్టి మరల్చడమే
- దేవుడు దిగి వచ్చినా సభ నిర్వహణ సాధ్యం కాదన్న రేవంత్ రెడ్డి
దేవుడు దిగి వచ్చినా సెప్టెంబర్ 2న 'ప్రగతి నివేదన సభ' నిర్వహించటం కేసీఆర్ కు సాధ్యం కాదని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం కావడంతో ఏం చేయాలో పాలుపోక ప్రజల దృష్టిని మళ్ళించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక ఇష్యూ నుండి జనాల దృష్టిని మరల్చటం కేసీఆర్ కే సాధ్యమన్నారు. కాంగ్రెస్ సభ విజయవంతం కావడంతో ప్రజల్లో దాని ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నమే టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సభ సాధ్యం కాదని నిఘా వర్గాలు నివేదిక ఇచ్చాయని, ఒకవేళ సెప్టెంబర్ 2న సభ పెట్టినా 25 లక్షల మంది కూడా రారని అన్నారు. ప్రజలను ఇంకెంతోకాలం మోసం చేయలేరని చెప్పిన రేవంత్ రెడ్డి, ఎప్పుడూ ఏదో ఒక డ్రామా చేసే కేసీఆర్ ఇప్పుడు ముందస్తు ఎన్నికల డ్రామాకు దిగినట్టు తెలిపారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదనే అసత్య ప్రచారానికి టీఆర్ఎస్ నేతలు దిగుతున్నారని, అది వారి దిగజారుడుతనమని రేవంత్ రెడ్డి అన్నారు. టీడీపీతో పొత్తుపై పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని ఆయన చెప్పారు.