New Delhi: ఢిల్లీ దూరదర్శన్ భవన్‌లో అగ్నిప్రమాదం
- ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్‌లో మంటలు
- పది నిమిషాల్లోనే అదుపులోకి
- ప్రమాదానికి గల కారణంపై ఆరా
ఢిల్లీలోని దూరదర్శన్ భవన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ ఢిల్లీలోని మండీ హౌస్ ప్రాంతంలో ఉన్న ఈ భవనంలోని ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా పొగకమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 8 అగ్నిమాపక యంత్రాలతో పది నిమిషాల్లోనే మంటలను అదుపు చేశారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
కాగా, బుధవారం ఉదయం ముంబైలోని పరేల్ ప్రాంతంలో ఉన్న క్రిస్టల్ టవర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పదహారు మంది గాయపడ్డారు. అపార్టుమెంట్ లోని 12వ అంతస్తులో ఈ ప్రమాదం సంభవించింది. అపార్టుమెంట్‌లో చిక్కుకుపోయిన వారిని క్రేన్ల సాయంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించారు.