india: ప్రఖ్యాత జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కన్నుమూత!
- ఢిల్లీలో తుదిశ్వాస విడిచిన కుల్దీప్ నయ్యర్
- 1997లో రాజ్యసభకు నామినేట్
- బ్రిటన్ లో భారత హైకమిషనర్ గా విధులు
సీనియర్ జర్నలిస్ట్, బ్రిటన్ లో భారత హైకమిషనర్ గా పనిచేసిన కులదీప్ నయ్యర్ (95) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన దేశ రాజధానిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అవిభక్త భారత్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న సియాల్ కోట్ లో 1923, ఆగస్టు 14న నయ్యర్ జన్మించారు.
నయ్యర్ 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కెరీర్ తొలినాళ్లలో ఉర్దూ జర్నలిస్ట్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత ఇంగ్లిష్ పత్రిక ‘స్టేట్ మెన్’లో పనిచేశారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించడంతో ఆమె నయ్యర్ ను జైలులో పెట్టించారు.
పాక్ రహస్యంగా చేపడుతున్న అణు కార్యక్రమాన్ని నయ్యర్ బయటపెట్టారు. పాక్ అణు పితామహుడు ఏక్యూ ఖాన్ ను ఇంటర్వ్యూ చేసిన నయ్యర్.. ఆయన్ను ఉడికించే ప్రశ్నలు వేసి పాక్ అణ్వాయుధాలను రహస్యంగా అభివృద్ధి చేస్తున్న అంశాన్ని ప్రపంచానికి తెలియజేయగలిగారు.
బ్రిటన్ లో భారత హైకమిషనర్ గా కూడా ఆయన పనిచేశారు. తన జీవిత అనుభవాలను నయ్యర్ ‘బియాండ్ ది లైన్స్: ఆన్ ఆటోబయోగ్రఫి’ పేరుతో పుస్తకం రాశారు.