chinise gaoat: థమ్స్ అప్ ను గటగటా తాగేస్తున్న 'చైనీస్' మేక.. ఎవ్వరికీ అమ్మనంటున్న భారత యజమాని!
- యూపీలోని అలీగఢ్ లో వింత మేక
- కూల్ డ్రింక్స్, పళ్లు మాత్రమే ఆహారం
- చూసేందుకు ఎగబడుతున్న జనం
మేకలు ఏం తింటాయ్? ఇదేం పిచ్చి ప్రశ్న.. మేకలు అన్నాక ఆకులు, గడ్డి తింటాయ్ అని కొట్టిపారేయకండి. ఎందుకంటే ఆగ్రాలో ఉంటున్న ‘చైనీస్’ మేకను చూస్తే ఈ అభిప్రాయాన్ని మీరు మార్చుకుంటారు. ఎందుకంటే ఇది అలాంటి ఇలాంటి మేక కాదు.
దాదాపు ఏడాది వయసున్న ఈ ‘చైనీస్’ మేకకు థమ్స్ అప్ అంటే చాలా ఇష్టం. ఇలా బాటిల్ లో పోసి పెట్టేస్తే గ్యాప్ ఇవ్వకుండా గటగటా తాగేస్తోంది. థమ్స్ అప్ మాత్రమే కాదు కోకాకోలా, పెప్సీ లాంటి కూల్ డ్రింక్స్ ను చల్లగా లాగించేస్తోంది. దీంతో ఈ మేక బరువుకు సంవత్సరానికే 70 కేజీలకు చేరుకుంది.
ఇంతలా కూల్ డ్రింక్స్ తాగుతోంది కదా, మరి ఆహారంగా ఏం తీసుకుంటోందనేగా మీ సందేహం? ఆకులు, అలములకు కొంచెం దూరంగా ఉండే ఈ మేక తాజా పళ్లు, డ్రై ఫ్రూట్లను ఆహారంగా తీసుకుంటోంది! ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ మీడియా చానెల్ ఇటీవల ప్రసారం చేయడంతో ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో ఉంటున్న ఈ మేక ఫేమస్ అయిపోయింది.
దీంతో మేం కొంటాం అంటే మేం కొంటాం.. అంటూ పలువురు బక్రీద్ సందర్భంగా ఈ మేక కోసం పోటీపడ్డారు. అయితే యజమాని వసీమ్ మాత్రం తాను ఈ మేకను అమ్మబోనని తేల్చిచెప్పాడు. మరో విశేషం ఏమిటంటే, ఈ మేకను చైనా నుంచి తెప్పించుకోలేదనీ, చిన్నచిన్న కళ్లు ఉండటంతో తానే ముద్దుగా ఈ మేకకు చైనీస్ అని పేరు పెట్టానని చెప్పుకొచ్చాడు. తమ ఇంట్లో 150 కేజీలతో సుల్తాన్ అనే అఫ్గాన్ జాతి మేక ఉన్నప్పటికీ.. చాలామంది చైనీస్ ను చూసేందుకు వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశాడు.