lawrence: కోటి రూపాయల విరాళం.. రియల్ హీరో అనిపించుకున్న లారెన్స్!
- సినీ పరిశ్రమలో ఎవరూ ఇవ్వనంత డొనేషన్
- లారెన్స్ కు శనివారం అపాయింట్ మెంట్ ఇచ్చిన కేరళ సీఎం
- పునరావాస కార్యక్రమాల్లో నేరుగా పాల్గొననున్న లారెన్స్
వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళకు భారీ విరాళం ప్రకటించాడు లారెన్స్ రాఘవ. సినీ పరిశ్రమలో మరెవరూ ఇవ్వనంత ఎక్కువ విరాళాన్ని ప్రకటించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టిన లారెన్స్... కేరళ వరద బాధితులకు ఏకంగా కోటి రూపాయలను విరాళంగా ప్రకటించాడు. అంతేకాదు కేరళకు స్వయంగా వెళ్లి, అక్కడి ప్రజలకు సర్వీస్ చేయాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన స్వయంగా తెలిపాడు.
'హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్. కేరళకు కోటి రూపాయల విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. కేరళలో ఉన్న మన సోదరులు, సోదరీమణులు వరదల వల్ల ఎంతో కోల్పోయారు. రాష్ట్రం అతలాకుతలమైంది. ఇది ఎంతగానో కలచి వేసే విషయం. అక్కడి దారుణ పరిస్థితులను చూసిన తర్వాత, స్వయంగా అక్కడకు వెళ్లి, ప్రజలకు సేవ చేయాలని అనుకున్నా. కానీ, భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా, ఇప్పుడే రావద్దని అక్కడివారు నాకు సూచించారు. వర్షాలు తగ్గాక రావాలని చెప్పారు. ఇప్పుడు వర్షాలు తగ్గిన నేపథ్యంలో కేరళకు వెళ్లి, అక్కడి ప్రభుత్వ అధికారులతో కలసి పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటా.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాకు శనివారం నాడు అపాయింట్ మెంట్ ఇచ్చారు. నా విరాళాన్ని నేరుగా సీఎంకు అందజేస్తా. వరద బాధితులకు నేరుగా సేవ చేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఆయనను కోరుతా. కేరళను ఆదుకున్న వారందరికీ ధన్యవాదాలు. కేరళ త్వరగా కోలుకోవాలని రాఘవేంద్రస్వామిని ప్రార్థిస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు.