Russia: అమెరికా, రష్యాలకు ఇక పీడకలే.. హెచ్చరించిన ఐసిస్ చీఫ్ బగ్దాదీ!
- పశ్చిమ దేశాలపై దాడులకు పిలుపు
- భవిష్యత్ లో విజయం సాధిస్తామన్న బగ్దాదీ
- 2017లోనే చనిపోయినట్లు ప్రకటించిన రష్యా
ఆత్మాహుతి, ట్రక్కు దాడులతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) గుర్తుంది కదా? ప్రపంచవ్యాప్తంగా దాడులకు పాల్పడాలంటూ ఉగ్రవాదులను ఈ సంస్థ చీఫ్ గా ఉన్న అబూబకర్ అల్ బగ్దాదీ రెచ్చగొట్టేవాడు. బగ్దాదీ పిలుపుతో చాలామంది ఉగ్రవాదులు ఫ్రాన్స్, బ్రిటన్ ,బెల్జియం, జర్మనీ, అమెరికా దేశాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించారు. 2014లో తనను తాను ఖలీఫా(ఇస్లామిక్ సామ్రాజ్య చక్రవర్తి)గా ప్రకటించుకున్న బగ్దాదీ దాదాపు ఏడాది తర్వాత తాజాగా ఆడియో క్లిప్ విడుదల చేశాడు.
అమెరికా, రష్యాల నేతృత్వంలోని సైన్యాలు సిరియా, ఇరాక్ లో ఐసిస్ అధీనంలోని 90 శాతానికి పైగా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బక్రీద్ పర్వదిన సందర్భంగా బగ్దాదీ ఆడియో టేప్ ను విడుదల చేశాడు. పశ్చిమ దేశాలపై దాడులకు తెగబడాలని అందులో ఉగ్రవాదులకు పిలుపునిచ్చాడు. జిహాద్ లో ఇప్పుడు నష్టపోయినా భవిష్యత్ లో కచ్చితంగా విజయం దక్కుతుందని ఉగ్రమూకలకు ధైర్యం నూరిపోశాడు. అమెరికా, రష్యాలు ఇక భయంకరమైన దాడులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. ఈ మేరకు అరబ్, ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని తన అనుచరులకు బగ్దాదీ సందేశం పంపాడు.
2014లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఐసిస్ సిరియా, ఇరాక్ లో గణనీయమైన భూభాగాన్ని అక్రమించుకుని ఈ ప్రాంతాన్ని ఇస్లామిక్ స్టేట్(ఇస్లామిక్ రాజ్యంగా) ప్రకటించింది. మతం మారని వేలాది మంది మైనారిటీలను ఊచకోత కోసి హతమార్చింది. దీంతో బగ్దాదీ ఆచూకీ చెప్పినవారికి రూ.175.16 కోట్ల బహుమతి ఇస్తామని గతంలోనే అమెరికా ప్రకటించింది. గతేడాది తాము జరిపిన వైమానిక దాడుల్లో బగ్దాదీ చనిపోయాడని అప్పట్లో రష్యా సైన్యం తెలిపింది. ఈ నేపథ్యంలో బగ్దాదీ ఆడియో విడుదల చేయడం గమనార్హం.