Chandrababu: కర్మ కాలి ‘కాంగ్రెస్’తో పొత్తుపెట్టుకుంటే చంద్రబాబు తప్పు చేసినట్టే!: మంత్రి అయ్యన్నపాత్రుడు
- నాడు టీడీపీని స్థాపించి కాంగ్రెస్ ను తరిమికొట్టారు
- ఆ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారనుకోను
- బాక్సైట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు
ఏపీలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందన్న వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్మ కాలి ‘కాంగ్రెస్’తో టీడీపీ పొత్తుపెట్టుకుంటే చంద్రబాబు తప్పు చేసినట్టేనని వ్యాఖ్యానించారు. నాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి.. ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టారని, అటువంటి పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారని తాను అనుకోవట్లేదని అన్నారు.
నర్సీపట్నం ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా అడ్డుకుంటా
కాగా, ప్రత్యూష కంపెనీ యాజమాన్యం, ఆర్టీసీ అధికారులపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నం ఆర్టీసీ స్థలాన్ని మల్టీప్లెక్స్ నిర్మాణానికి ఐదేళ్ల కిందటే గంటాకు కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టిందని అన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, ఎవరైనా నిర్మాణాలు చేపడితే అడ్డంగా పాతిపెడతానని, అధికారులని కూడా చూడనని హెచ్చరించారు. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ కు ఇవ్వడాన్ని మాత్రం తాను అంగీకరించనని కరాఖండిగా చెప్పారు.
నర్సీపట్నం ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా అడ్డుకుంటానని, తన మంత్రి పదవిని కూడా లెక్క చేయనని అన్నారు. నాడు బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని, బాక్సైట్ కాంట్రాక్ట్ ను బంధువులకు కట్టబెట్టే ప్రయత్నం చేశారని, జగన్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. విశాఖపట్టణం జిల్లా మాకవరంపాలెంలో బాక్సైట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తాను ఏమాత్రం వ్యతిరేకం కాదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.