NASA: నేడు కక్ష్యలోకి భారత్ బుల్లి ఉపగ్రహం ‘జై హింద్`1ఎస్’..నింగిలోకి పంపనున్న నాసా
- చెన్నై విద్యార్థులే ఈ శాటిలైట్ రూపకర్తలు
- కేవలం 33.39 గ్రాముల బరువు
- ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు
అంతరిక్షంలో భారత్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విద్యార్థులు రూపొందించిన ప్రపంచంలోనే అతి చిన్న ఉపగ్రహం ‘జైహింద్`1ఎస్’ నేడు నింగిలోకి చేరనుంది. ఈ బుల్లి శాటిలైట్ బరువు కేవలం 33.39 గ్రాములు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కొలంబియా సైంటిఫిక్ బెలూన్ ఫెసిలిటీ నుంచి బెలూన్ సాయంతో దీన్ని నేడు కక్ష్యలోకి చేరుస్తోంది.
తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలోని హిందుస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు కె.జె.హరికృష్ణన్, పి.అమర్నాథ్, జి.సుధీ, టి.గిరిప్రసాద్లు ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. ‘అంతరిక్షంలో సంచరిస్తున్న భిన్న పదార్థాలు, గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉన్నప్పుడు వాటి ప్రవర్తన అర్థం చేసుకునేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది’ అని శాటిలైట్ రూపొందించిన విద్యార్థుల గైడ్ జి.దినేష్ కుమార్ తెలిపారు.