Vijayawada: అరకు ఎంపీ గీత కొత్త పార్టీ.. చంద్రబాబు, జగన్ పై తీవ్ర విమర్శలు!
- విజయవాడలో పార్టీ ప్రకటన
- అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు
- యువత, మహిళలకు ప్రాధాన్యం ఇస్తానని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. అరకు లోక్ సభ ఎంపీ కొత్తపల్లి గీత ఈ రోజు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో జన జాగృతి పార్టీని స్థాపించారు. తెలుపు, నీలం రంగుల్లో మధ్యలో గొడుగు గుర్తుతో ఉన్న పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మార్పు కోసం ముందడుగు నినాదంతో తాను ఈ పార్టీని స్థాపించానని గీత తెలిపారు.
తాను గతంలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేశాననీ, నాలుగున్నరేళ్లుగా ఎంపీగా ఉన్నానీ గీత చెప్పారు. ప్రజా సమస్యలను తాను చాలా దగ్గరగా చూశానని అన్నారు. ఈ అనుభవంతో ప్రజలకు మంచి చేసేందుకే పార్టీని పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలను ఆమె తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగాలు, ఉపాధి విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు యువతను తీవ్రంగా మోసం చేశారనీ, తన కుమారుడికే ఉద్యోగం (మంత్రి పదవి) ఇచ్చుకున్నారని గీత దుయ్యబట్టారు.
ప్రతిపక్ష నేత జగన్ అసలు అసెంబ్లీకే రారనీ, ఆయనకు ప్రజా సమస్యలు పట్టవని గీత విమర్శించారు. జగన్ కు సీఎం కావాలన్న కాంక్ష ఎక్కువన్నారు. జన జాగృతి పార్టీలో మహిళలు, యువతకు ప్రాధాన్యమిస్తానని గీత తెలిపారు. తాము ప్రజలతో మమేకమై మేనిఫెస్టోను రూపొందిస్తామని వ్యాఖ్యానించారు. స్థానిక సమస్యల ఆధారంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మేనిఫెస్టోను తయారుచేస్తామని చెప్పారు.