rajbhavan: ఈ ఏడాది రాఖీ వేడుకలు చేసుకోవడం లేదు: గవర్నర్ నరసింహన్
- రాఖీ వేడుకలను నిర్వహించడం లేదన్న నరసింహన్
- కేరళ జల ప్రళయం నేపథ్యంలో వేడుకలు రద్దు
- అందరూ కేరళకు సాయం చేయాలంటూ పిలుపు
సోదరసోదరీమణుల మధ్య అనుబంధాన్ని రాఖీ వేడుకలు మరింత బలోపేతం చేస్తాయి. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే దేశ వ్యాప్తంగా ఎంతో సందడి నెలకొంటుంది. రక్తం పంచుకున్న వారికే కాకుండా, సోదర సమానులుగా భావించే వారికి అక్కాచెల్లెళ్లు రాఖీలు కడుతుంటారు. తద్వారా తమ ప్రేమను, అభిమానాన్ని చాటుకుంటుంటారు.
ప్రతియేటా గవర్నర్ అధికార నివాసం రాజ్ భవన్ లో ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతుండటం ఆనవాయతీ. ఎంతో మంది చిన్నారులు, యువతులు, మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాఖీ కట్టి, తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. రాఖీ పౌర్ణమి రోజు రాజ్ భవన్ కొత్త కాంతిని సంతరించుకుంటుంటుంది.
అయితే, ఈ ఏడాది రాజ్ భవన్ లో రాఖీ వేడుకలను నిర్వహించడం లేదని గవర్నర్ నరసింహన్ తెలిపారు. కేరళ వరదల నేపథ్యంలో, రాఖీ వేడుకలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రజలు తమకు తోచిన సహాయాన్ని కేరళకు చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.