Kerala: కేరళ బాధితుల కోసం పెళ్లి నగల డబ్బులు ఇచ్చేసిన కాబోయే వధువు!
- పెళ్లి నగల కోసం లక్ష రూపాయలు దాచుకున్న అమృత
- వరద బాధితుల కష్టాలు చూసి చలించిన యువతి
- పెళ్లి రోజున నగలు ధరించనని కాబోయే భర్తకు చెప్పేసిన అమృత
కేరళ వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఓ యువతి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. పెళ్లి నగల కోసం దాచుకున్న డబ్బులను వరద బాధితులకు సాయంగా ప్రకటించి తనలోని దాతృత్వాన్ని చాటుకుంది. కోజికోడ్ జిల్లా వటకారకు చెందిన అమృత ఎస్ వేణు బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. వచ్చే నెల 15న ఆమె వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లలో మునిగిపోయారు. కాగా, పెళ్లి కోసం నగలు కొనుగోలు చేసేందుకు అమృత ప్రత్యేకంగా లక్ష రూపాయలు పక్కన పెట్టుకుంది.
వరదలతో అతలాకుతలమైన కేరళలో బాధితులు పడుతున్న పాట్లను చూసిన అమృత మనసు చలించిపోయింది. నగల కోసం దాచుకున్న లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించింది. ఈ విషయాన్ని కాబోయే భర్తకు చెప్పింది. పెళ్లి రోజున తాను నగలు ధరించబోనని చెప్పడంతో అతడూ అందుకు అంగీకరించాడు. కాగా, అమృత ఇచ్చిన లక్ష రూపాయల చెక్కును ఆమె తండ్రి వేణు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.