KCR: మోదీతో ఈరోజు భేటీ కానున్న కేసీఆర్.. కొత్త జోనల్ విధానంపైనే ప్రధానంగా దృష్టి!
- సాయంత్రం 4.10 గంటలకు అపాయింట్ మెంట్
- విద్యాసంస్థల ఏర్పాటు, జోనల్ విధానంపై చర్చ
- ముందస్తుపై మోదీ అభిప్రాయం తెలుసుకోనున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం 4.10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ప్రస్తుతం 3 రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్, '7 లోక్ కళ్యాణ్ మార్గ్' లోని ప్రధాని మోదీ నివాసంలో ఆయన్ను కలుసుకోనున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిన్న జరిగిన సమావేశంలో పార్టీ నేతలను కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
ప్రధానితో భేటీ సందర్భంగా కొత్త జోనల్ విధానంపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం, స్థానికేతరులకు 5 శాతం కేటాయిస్తూ తెచ్చిన జోనల్ విధానంపై కేంద్రం గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. కనీసం 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు, మిగిలిన 20 శాతం ఉద్యోగాలు స్థానికేతరులకు ఇవ్వాలని సూచించింది. అలా కుదరని పక్షంలో స్థానికులకు ఉద్యోగాల కల్పనను 85 శాతానికి పెంచుకోవచ్చని చెప్పింది.
అయితే స్థానికులకు మరిన్ని ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త జోనల్ విధానాన్ని తీసుకొచ్చామని కేసీఆర్ మోదీకి వివరిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ముందస్తు ఎన్నికలపై ప్రధాని మనసులో ఏముందో తెలుసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే తెలంగాణలో మరిన్ని ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రధానికి కేసీఆర్ విన్నవించనున్నారు. ప్రగతి నివేదన సదస్సు పూర్తయిన రెండు మూడు రోజుల్లోనే అసెంబ్లీని రద్దుచేసే అవకాశముందని సమాచారం.