Tamilnadu: ఖననం చేయాలి.. కాదు కాదు దహనమే చేయాలి: భర్త అంత్యక్రియలపై కోర్టును ఆశ్రయించిన ఇద్దరు భార్యలు!
- హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు అంటున్న మొదటి భార్య
- క్రైస్తవ ఆచారం ప్రకారం అంటున్న రెండో భార్య
- దిమ్మతిరిగే ఆదేశాలు ఇచ్చిన జడ్జి
కొన్నికొన్ని విషయాలను చూస్తే నవ్వాలో లేక ఏడవాలో అన్న అనుమానం వస్తుంది. తాజాగా అలాంటి ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన దక్షిణమూర్తి తొలుత తంగమ్మాళ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత తంగమ్మాళ్ కు విడాకులు ఇవ్వకుండానే ఏసుమేరి అలియాస్ గౌరీని దక్షిణమూర్తి వివాహం చేసుకున్నాడు.
అయితే అతను బతికి ఉన్నంతవరకూ అన్నీ సవ్యంగానే సాగాయి. రెండో భార్య దగ్గరే ఎక్కువ సేపు గడిపే దక్షిణమూర్తి.. మొదటి భార్య తంగమ్మాళ్ కు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నాడు. అయితే మూర్తి ఈ నెల 16న అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో అసలు సమస్య మొదలయింది.
మొదటి భార్య తంగమ్మాళ్ ఏమో భర్తను హిందూ సంప్రదాయం ప్రకారం దహనం చేయాలని పట్టుబట్టగా, రెండో భార్య ఏసుమేరి మాత్రం దక్షిణమూర్తిని క్రైస్తవ మతాచారం ప్రకారం ఖననం చేయాలని డిమాండ్ చేసింది. ఖననం చేయాలనే తన భర్త కోరుకున్నారంటూ ఆయన రాసినట్లు చెబుతున్న ఓ లేఖను బయటపెట్టింది. అయితే అందులో సంతకానికి బదులుగా వేలిముద్ర ఉంది. కానీ మొదటి భార్య తనే కాబట్టి హిందూ సంప్రదాయం ప్రకారం దహనం చేయాల్సిందేనని తంగమ్మాళ్ స్పష్టం చేసింది.
ఈ పంచాయితీ తేలకపోవడంతో శవం కుళ్లిపోయే దశకు చేరింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని దాన్ని మార్చురీకి తరలించారు. ఈ వ్యవహారంలో ఇద్దరు భార్యలు కోర్టుకెక్కగా, న్యాయమూర్తి ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోగా ఇద్దరు ఏకాభిప్రాయానికి రాకుంటే అనాథ శవంగా పరిగణించి మున్సిపాలిటీ అధికారులే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేశారు.