Rahul Gandhi: అబ్బే.. నాకు అటువంటి ఆలోచనేమీ లేదు!: ప్రధానిమంత్రి పదవిపై రాహుల్
- ప్రధాని కావాలన్న ఆశ లేదు
- సైద్ధాంతికంగా మాత్రం పోరాడతా
- 2014 తర్వాతే నాలో ఈ మార్పు
ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. ప్రధాని కావాలన్న ఉద్దేశం తనకు లేదని, అయితే, సైద్ధాంతికంగా మాత్రం పోరాడతానని స్పష్టం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ప్రసంగం అనంతరం రాహుల్ భారత జర్నలిస్టులతో మాట్లాడారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జర్మనీ, యూకేలో పర్యటిస్తున్న ఆయన అక్కడి ఎన్నారైలతో మమేకమవుతున్నారు.
తనకు ప్రధాని కావాలన్న ఆకాంక్ష ఏమీ లేదని, సైద్ధాంతికంగా మాత్రం పోరాడతానని పేర్కొన్నారు. 2014 తర్వాతే తనలో ఈ మార్పు వచ్చిందని పాత్రికేయులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం భారతదేశం, దేశ ప్రజలు ముప్పు ముంగిట ఉన్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ అంశంపై మాట్లాడుతూ.. తమ సమస్య నేరపూరితమైన అంశాలపైనేనని తేల్చి చెప్పారు. అంతే తప్ప తామెవరిపైనా బురద జల్లబోమని పేర్కొన్నారు. కాగా, రెండు రోజుల క్రితం రాహుల్ మాట్లాడుతూ డోక్లాం విషయంలో తామైతే చైనాను విజయవంతంగా నిలువరించగలిగే వారమని పేర్కొన్నారు.