Vasundhara Raje: గౌరవ యాత్రలో సీఎంకు చేదు అనుభవం.. వసుంధరపై రాళ్ల దాడి!

  • ముఖ్యమంత్రి బస్సుపై రాళ్ల దాడి
  • యాత్ర రద్దు చేసుకున్న వసుంధర
  • కాంగ్రెస్ పనేనని ఆరోపణ

రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు చేదు అనుభవం ఎదురైంది. గౌరవ యాత్ర పేరిట రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆమెకు జోధ్‌పూర్‌లో నిరసన సెగలు తగిలాయి. శనివారం సాయంత్రం ఆమె పర్యటిస్తున్న బస్సుపై కొందరు రాళ్లు రువ్వారు. దీంతో పర్యటనను రద్దు చేసుకున్న సీఎం ప్రత్యేక విమానంలో జైపూర్ వెళ్లిపోయారు. నిజానికి ఆమె ఆ రాత్రి పిపార్‌సిటీలో బస చేయాల్సి ఉంది. కాగా, నిరసనకారుల రాళ్ల దాడిలో సీఎంకు ఎటువంటి గాయాలు కాలేదు.

ముఖ్యమంత్రి వసుంధరపై రాళ్లదాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన వెనక కాంగ్రెస్ హస్తం ఉందని ఆరోపించింది. సీఎం వసుంధర మాట్లాడుతూ తనపై రాళ్ల దాడి వెనక కాంగ్రెస్ హస్తం ఉందని, రాష్ట్రాభివృద్ధి కోసం తన ప్రాణాలైనా ఇస్తానని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, ఇప్పుడు తాము చేస్తుంటే తట్టుకోలేక ఇటువంటి పనులకు ఒడిగడుతున్నారని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లట్ పేరును వసుంధర ప్రస్తావించకపోయినప్పటికీ.. రాళ్లదాడికి పాల్పడిన వారు అశోక్ గెహ్లట్ పేరుతో నినాదాలు చేసినట్టు చెబుతున్నారు.

 సీఎం ఆరోపణలపై రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే హీరా లాల్ బిష్ణోయ్ మాట్లాడుతూ... బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. అందుకే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని అన్నారు. వసుంధర రాజే బస్సుపై దాడిచేసిన వారికి కాంగ్రెస్‌తో సంబంధం లేదని తేల్చి చెప్పారు. గెహ్లట్ మాజీ ముఖ్యమంత్రి అని, కాబట్టి అందరికీ ఆ పేరు చిరపరిచితమేనని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News