Amit shah: అది భద్రతకు సంబంధించిన విషయం.. వివరాలివ్వలేం!: అమిత్ షా భద్రత ఖర్చులపై కేంద్రం
- అమిత్ షా భద్రత ఖర్చుపై వివరాలు అడిగిన జునేజా
- ఇవ్వడం కుదరదన్న సీఐసీ
- హైకోర్టును ఆశ్రయించినా ఫలితం శూన్యం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భద్రత ఖర్చులకు సంబంధించిన వివరాలు ఇవ్వలేమంటూ, సమాచార హక్కు చట్టం ద్వారా ఆ సమాచారం కోరిన దరఖాస్తుదారుడికి కేంద్రం తేల్చిచెప్పింది. 5 జూలై 2014న దీపక్ జునేజా అనే వ్యక్తి అమిత్ షా భద్రతకు సంబంధించిన ఖర్చు వివరాలు తెలపాలంటూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)కి దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటికి రాజ్యసభ సభ్యుడు కాని అమిత్ షాకు ప్రజల సొమ్ముతో భద్రత కల్పించడంపై ఈ దరఖాస్తు దాఖలైంది.
జునేజా కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు హోంమంత్రిత్వ శాఖ, సీఐసీ తిరస్కరించాయి. ఇందుకు వ్యక్తిగత గోప్యత, భద్రతకు ముప్పు వంటి కారణాలను సాకుగా చూపాయి. దీంతో జునేజా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు జునేజా దరఖాస్తును మరోసారి పరిశీలించాల్సిందిగా సీఐసీకి సూచించింది. అయితే, తొలుత చెప్పిన కారణాలనే మరోమారు చెబుతూ సమాచారం వెల్లడించడం కుదరదని తేల్చి చెప్పింది.