Manmohan Singh: నెహ్రూ మెమోరియల్ జోలికి పోవద్దు: మోదీకి మన్మోహన్ ఘాటు లేఖ!
- నెహ్రూ వస్తువులతో ఉన్న మెమోరియల్ కాంప్లెక్స్
- ప్రధానుల మ్యూజియంగా చేయాలని కేంద్ర యోచన
- ఆగ్రహంతో లేఖ రాసిన మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ కాంప్లెక్స్ ను మార్చాలని నరేంద్ర మోదీ సర్కారు యోచిస్తోందన్న వార్తలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆగ్రహం వచ్చింది. ఈ విషయంలో ముందడుగు వేయవద్దని హెచ్చరిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీకి ఘాటైన పదాలతో ఆయన ఓ లేఖను రాశారు. భారత చరిత్రకు, వారసత్వానికి నిదర్శనంగా నిలిచిన నెహ్రూ మెమోరియల్ కాంప్లెక్స్ జోలికి వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు.
జవహర్ లాల్ నెహ్రూ ఉపయోగించిన వస్తువులు కేవలం కాంగ్రెస్ పార్టీవి మాత్రమే కాదని, అవి జాతి సంపదని మన్మోహన్ అభివర్ణించారు. నెహ్రూ మెమోరియల్ కాంప్లెక్స్ ను ప్రధానులందరి మ్యూజియంగా మార్చాలని కేంద్రం భావిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ వాజ్ పేయి వాడిన వస్తువులను ప్రదర్శనకు ఉంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మన్మోహన్ సింగ్, కేంద్ర ప్రభుత్వం తన అజెండాలో నెహ్రూ మెమోరియల్ కాంప్లెక్స్ ను మార్చాలని భావిస్తుండటం దురదృష్టకరమని అన్నారు. ఈ మ్యూజియం భారత తొలి ప్రధానికి అంకితమని, ఆయన గొప్పతనాన్ని ప్రత్యర్థులు, శత్రువులు కూడా గుర్తించారన్న విషయాన్ని మనసులో పెట్టుకోవాలని అన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి ఓ సందర్భంలో, నెహ్రూ సేవలను గుర్తిస్తూ చేసిన వ్యాఖ్యలను తన లేఖలో మన్మోహన్ ప్రస్తావించారు. జాతి ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాలని సూచించారు.