TRS: మా సభలలో బజ్జీలు అమ్ముకున్నంత మంది కూడా ‘కాంగ్రెస్’ సభలకు రాలేదు: ఎంపీ బాల్క సుమన్
- కనివినీ ఎరుగని రీతిలో ప్రగతి నివేదన సభ నిర్వహిస్తాం
- మా నాయకులకు ఇచ్చింది నగదు డబ్బాలు కాదు
- డబ్బులు పంచే సంస్కృతి మా పార్టీదీ కాదు
వచ్చే నెల 2న టీఆర్ఎస్ నిర్వహించనున్న ప్రగతి నివేదన సభపై టీ-కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండటంపై ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాము ప్రగతి నివేదన సభ నిర్వహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఉలుకు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన రాహుల్ గాంధీ సభల్లో ప్రజలు లేక వెలవెలబోయాయని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ బహిరంగ సభలలో ఛాయ్, బిస్కెట్లు, బజ్జీలు అమ్ముకున్నంత మంది కూడా ‘కాంగ్రెస్’ సభలకు రాలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లక్షలాది మందితో బహిరంగ సభలు నిర్వహించడం టీఆర్ఎస్ కు కొత్తేమీ కాదని, కనివినీ ఎరుగని రీతిలో ప్రగతి నివేదన సభ నిర్వహించబోతున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందని ప్రశంసించారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు నగదు డబ్బాలను ఇచ్చారన్న ఆరోపణలపై బాల్క సుమన్ స్పందిస్తూ.. తమ నాయకులకు ప్రగతి నివేదన సభ సామాగ్రిని డబ్బాల్లో పెట్టి అందిస్తే.. ఆ డబ్బాల్లో డబ్బు ఉందంటూ కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, డబ్బులు పంచే సంస్కృతి తమ పార్టీది కాదని అన్నారు. గతంలో డబ్బులు పంచి అడ్డంగా దొరికిపోయి జైల్లో చిప్పకూడు తిన్నది రేవంత్ రెడ్డి కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.