Tamilnadu: నన్ను పార్టీలో చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు.. డీఎంకే బహిష్కృత నేత అళగిరి హెచ్చరిక
- పార్టీలో రచ్చకెక్కిన ఆధిపత్య పోరు
- తాను పార్టీలోకి రావడం అత్యవసరమన్న అళగిరి
- తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి తర్వాత డీఎంకేలో ఆధిపత్య పోరు మొదలైంది. పార్టీ చీఫ్ పదవి కోసం స్టాలిన్, పార్టీ కోశాధికారి పదవికి సీనియర్ నేత ఎస్.దురై నామినేషన్ పత్రాలు సమర్పించారు. డీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్షుడితోపాటు కోశాధికారిని ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ బహిష్కృత నేత అళగిరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తనను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతం పార్టీని కాపాడుకోవాలంటే తాను తిరిగి పార్టీలో చేరడం తప్పనిసరి అని అళగిరి పేర్కొన్నారు. తనను కనుక పార్టీలోకి తిరిగి తీసుకోవడానికి నిరాకరిస్తే జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల అళగిరి మాట్లాడుతూ వచ్చే నెల 5న చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దీంతో అళగిరి-స్టాలిన్ మధ్య ఆధిపత్య పోరు తప్పదని భావించారు. అళగిరి తాజా వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ 2014లో అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.