jeans: త్రిపుర ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్.. జీన్స్, సన్ గ్లాసెస్ ఇక పక్కనపెట్టాల్సిందే!
- మీటింగ్లలో కూడా మొబైల్స్ వద్దు
- ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
- తగదన్న ప్రతిపక్షాలు
ప్రభుత్వ ఉద్యోగులకు త్రిపుర ప్రభుత్వం షాకిచ్చింది. డ్రెస్ కోడ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులెవరూ జీన్స్, కార్గోప్యాంట్లు, సన్ గ్లాసులు ధరించరాదని ఆదేశించింది. సమావేశాల్లో మొబైల్ ఫోన్లు వినియోగించరాదని పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ, ఎడ్యుకేషన్, సమాచార, సాంస్కృతి వ్యవహారాల ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మేజిస్ట్రేట్లు సహా అన్ని జిల్లాల ముఖ్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్, డిప్యూటీ ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ బర్మన్తో సమావేశాల్లో డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని అందులో పేర్కొన్నారు.
ఐఏఎస్ అధికారులు ఎప్పుడూ జీన్స్, డెనిమ్ షర్టులు ధరించి కార్యాలయాలకు వెళ్లడం తానెప్పుడూ చూడలేదని కుమార్ పేర్కొన్నారు. తాను మూడేళ్లు కేంద్ర ప్రభుత్వ అధికారిగా పనిచేశానని, ఆ సందర్భంలో తానీ విషయాన్ని గమనించానని అందులో పేర్కొన్నారు. అలాగే, సమావేశాల్లో మొబైల్ ఫోన్ వినియోగించడం కూడా అమర్యాదకరమని పేర్కొన్నారు. మీటింగ్ల సమయంలో చాలామంది ఫోన్లో మాట్లాడుతుండడం తాను గమనించానని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కూడా ఉద్యోగులకు ఈ విషయాన్ని పదేపదే చెప్పేవారని, మాట్లాడేటప్పుడు జేబుల్లో చేతులు పెట్టొద్దని సూచించేవారని గుర్తు చేశారు.
ఉద్యోగులకు డ్రెస్ కోడ్ నిర్ణయాన్ని ప్రతిపక్ష సీపీఎం ఖండించింది. ప్రజా సంక్షేమానికి, డ్రెస్కోడ్కు సంబంధం లేదని పేర్కొంది. ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు అందరికీ ఉంటుందని పేర్కొంది. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికింది. కాగా, మూడేళ్ల క్రితం మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటువంటి ఉత్తర్వులే జారీ చేసింది. 2015లో ప్రధాని నరేంద్రమోదీ చత్తీస్గఢ్లో పర్యటించినప్పుడు బస్తర్ జిల్లా మేజిస్ట్రేట్ అమిత్ కటారియా సన్ గ్లాసులు పెట్టుకోవడంతో మందలింపుకు గురయ్యారు.