Jurala: జూరాలకు మళ్లీ భారీ వరద... నిండిపోనున్న నాగార్జునసాగర్!
- ఆగస్టులోనే నిండనున్న నాగార్జున సాగర్
- కర్ణాటకలో నిన్నటి నుంచి వర్షాలు
- జూరాలకు 1.46 లక్షల క్యూసెక్కుల వరద
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్టుగా, ఆగస్టులోనే శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్ జలాశయం కూడా నిండుకుండ కానుంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆల్మట్టికి వచ్చిన నీటిని వచ్చినట్టు వదులుతుండటంతో జూరాల 14 గేట్లనూ ఈ ఉదయం మరోసారి తెరిచారు.
జూరాల రిజర్వాయర్ కు 1.46 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1.44 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ నీరంతా ఇప్పటికే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్న శ్రీశైలం మీదుగా నాగార్జున సాగర్ కు రానుంది. 885 అడుగుల నీటి మట్టం ఉన్న శ్రీశైలంలో ప్రస్తుతం 882.9 అడుగుల మేరకు నీరుంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నీటిని విడుదల చేస్తుండగా, ఈ సాయంత్రం లేదా రేపు మరోసారి గేట్లను ఎత్తే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.