Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో ఇంటిదొంగల చేతివాటం.. ఆధార్ కార్డులతో భారీగా రేషన్ సరుకుల లూటీ!
- ఉత్తరప్రదేశ్ లో అధికారుల నిర్వాకం
- ఇష్టానుసారంగా ఆధార్ కార్డుల వాడకం
- కఠిన చర్యలు తప్పవన్న కమిషనర్
పేదలకు అందాల్సిన రేషన్ సరుకులను అధికారులు నొక్కేశారు. దళారులతో కుమ్మక్కై సాంకేతిక సిబ్బంది సాయంతో ప్రజలకు అందించాల్సిన రేషన్ ను భారీగా దారి మళ్లించారు. ఆధార్ కార్డులను వేలాది సార్లు వాడి ప్రజలు రేషన్ తీసుకున్నట్లు బురిడీ కొట్టించారు.
ఉత్తరప్రదేశ్ లో ప్రజాపంపిణీ విభాగం అధికారులు దళారులు, సాంకేతిక సిబ్బందితో చేతులు కలిపి ఈ కుంభకోణానికి తెరదీశారు. రాష్ట్రవ్యాప్తంగా 859 ఆధార్ కార్డులను ఒకటి కాదు.. రెండు కాదు.. లక్షా యనభై వేల సార్లు వాడారు. పేదలకు అందాల్సిన బియ్యం, చక్కెర, గోధుమలను అక్రమంగా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారు. ఇందుకోసం ఆధార్ వివరాలతో పాటు దొంగ వేలిముద్రలను సాంకేతిక సిబ్బంది కొందరు తయారుచేశారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆదేశించిన అంతర్గత విచారణలో ఈ విషయం వెల్లడయింది. అలహాబాద్ లో అత్యధికంగా 107 ఆధార్ కార్డులతో నిందితులు 37,574 సార్లు రేషన్ సరుకులను తీసుకున్నారు. ఈ విషయమై యూపీ ఫుడ్ కమిషనర్ మాట్లాడుతూ.. పౌర సరఫరాల విభాగంలో ఆధార్ కార్డులతో కుంభకోణం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. టెక్నీషియన్లు, డీలర్లు, డేటాబేస్ ఆపరేటర్లు ఈ మోసంలో భాగస్వాములైనట్లు గుర్తించామన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.