stalin: డీఎంకే అధినేతగా స్టాలిన్.. అళగిరిని పట్టించుకోని పార్టీ నేతలు!
- డీఎంకే అధినేతగా ఎన్నికైన స్టాలిన్
- పార్టీ ట్రెజరర్ గా దురైమురుగన్
- అళగిరి హెచ్చరికలను పట్టించుకోని నేతలు
డీఎంకేలో నూతన శకం ప్రారంభమైంది. పార్టీ అధినేతగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరుణానిధి మరణంతో ఖాళీ అయిన పార్టీ అధ్యక్ష పదవికి ఆయన చిన్న కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ను డీఎంకే నేతలు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. కరుణ మరణం తర్వాత శోకసంద్రంలో మునిగిన పార్టీ కార్యాలయం, మళ్లీ ఈరోజు పండుగ శోభను సంతరించుకుంది.
మరోవైపు, పార్టీలో తనను చేర్చుకోవాలని, లేకపోతే తన సత్తా ఏంటో చూపిస్తానని స్టాలిన్ అన్న అళగిరి హెచ్చరిస్తున్నప్పటికీ... పార్టీ నేతలు ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదు. పార్టీ సీనియర్ నేత దురైమురుగన్ పార్టీ ట్రెజరర్ గా బాధ్యతలను చేపట్టనున్నారు. ఇప్పటిదాకా ఈ బాధ్యతలను కూడా స్టాలినే నిర్వహించారు. పార్టీ అధినేతగా ఎన్నికైన స్టాలిన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.